19 August 2010

నాన్న.....ది గ్రేట్ !!


నాన్న.....ది గ్రేట్ !!

ఒక్కొక్క వయసులో కొడుకు తండ్రి గురించి ఎలా అనుకుంటాడో చెప్తూ ఒక మెయిల్ వచ్చిందీమధ్య.
చదివేక నిజమేస్మీ అనిపించింది.

 నాలుగేళ్ళ వయసులో-
మా నాన్న చాలా గొప్పవాడు.

ఆరేళ్ళ వయసులో-
మానాన్నకి అందరూ తెలుసు.

పదేళ్ళ వయసులో -
నాన్న మంచివాడే కానీ కొంచెం కోపం ఎక్కువ.

 పన్నెండేళ్ళ వయసులో-
 నేను చిన్నప్పుడు నాన్న ఎంత ముద్దుగా చూసుకొనేవాడో.

పధ్నాలుగేళ్ళ వయసులో-
నాన్నకి చాదస్తం బాగా  ఎక్కువయిపోతోంది.
  
పదహారేళ్ళ వయసులో-
నాన్న ఈకాలంలో ఉండాల్సిన వాడు కాదు.

 పద్ధెనిమిదేళ్ళ వయసులో-
 మా నాన్న భలే తిక్క మనిషి.

ఇరవై ఏళ్ళ వయసులో -
అబ్బ....నాన్నని  భరించడం  రోజు రోజుకి కష్టమయిపోతోంది. అసలు అమ్మ ఎలా వేగుతోందో ఈయనతో.

ఇరవై ఐదేళ్ళ వయసులో-
ఏం చేద్దామనుకున్నా ఈ నాన్న వద్దంటాడు...

ముప్ఫై ఏళ్ళ వయసులో-
రాను రాను వీణ్ణి (నా కొడుకుని) పెంచడం కష్టమయిపోతోంది. మానాన్నంటే నాకెంత భయం ఉండేది.

నలభై ఏళ్ళ వయసులో-
నాన్న నన్నెంత క్రమశిక్షణతో పెంచారు. నేను కూడా అలాగే పెంచాలి వీడిని(కొడుకుని)

నలభై ఐదేళ్ళ వయసులో-

నాన్న మమ్మల్ని ఇంతబాగా  ఎలా పెంచారో ఆశ్చర్యంగా ఉంది.

యాభై ఏళ్ళ వయసులో-
మమ్మల్ని పెంచి పెద్దచెయ్యడానికి  నాన్న చాలా కష్టాలు పడ్డారు. నేను ఒక్క కొడుకుని పెంచడానికి ఇంత అవస్థ పడుతున్నాను.

యాభై ఐదేళ్ళ వయసులో-
మానాన్న చాలా ముందుచూపుతో, చక్కగా  మా భవిష్య్తత్తుని తీర్చిదిద్దారు.  నాన్నకి నాన్నే సాటి.

అరవై ఏళ్ళ వయసులో-
మా నాన్న చాలా గ్రేట్.

నాలుగేళ్ళ వయసులో ఊహ తెలిసిన దగ్గరనుండి చూస్తున్న నాన్నని, నాన్నలోని గొప్పదనాన్ని తెలుసుకోవడానికి యాభై ఆరేళ్ళు పట్టిందన్నమాట.

తల్లి, తండ్రి లోని విలువని తెలుసుకోవడానికి, వారికి మనపై గల ప్రేమలోని ఔన్నత్యాన్ని గ్రహించడానికి ఓ జీవిత కాలం అవసరమైందన్నమాట.

అమ్మ,నాన్న క్రమశిక్షణ పేరుతో  చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు  పిల్లలకి విసుగు కలిగిస్తాయి.ఆ నిర్ణయాల వెనుక తమ సంతానం భవిష్యత్ ని తీర్చిదిద్దుకోవాలనే తపనని  వయసులో చిన్న వాళ్ళైన పిల్లలు అర్థం చేసుకోలేరు. తమని కట్టడి చేస్తున్న తండ్రి లేదా తల్లి లోని కాఠిన్యాన్నే తప్ప దాని వెనక ఉన్న నవనీతంలాంటి ప్రేమాస్పద హృదయాన్ని గుర్తించలేరు.

క్రమశిక్షణతో పిల్లలను పెంచిన తల్లి తండ్రులకు, తమ కాళ్ళమీద తాము నిలబడి వ్యక్తిత్వం సంతరించుకోగలిగే పిల్లలనుండి ఎదురయ్యేవి  తీవ్ర నిరసనలూ, పరుషమైన పదజాలంతో కూడిన మాటలు.
ఆ పిల్లలకి మళ్ళీ పిల్లలు కలిగి వారికి అమ్మా నాన్నగా ఉన్నప్పుడు, తమ అమ్మ , నాన్న తమను పెంచినట్టే  తమ పిల్లలను పెంచాలనుకుంటారు. నా పిల్లలు అమాయకులు, వారికి ఏమీ తెలియదు, అన్ని జాగ్రత్తలతో వాళ్ళని కాచుకోవాలి అనుకుంటారు. ఈ జాగ్రత్తలు తరువాతి తరానికి అతి చాదస్తంగా కనిపిస్తాయి. తమ స్వేచ్ఛా జీవనానికి సంకెళ్ళుగా తోస్తాయి.  ఆ పిల్లలు తమను లక్ష్య పెట్టకుండా ప్రవర్తించినప్పుడు కానీ తాము కూడా అలాగే చేసామన్న విషయం గుర్తురాదు.
 జీవితాన్ని సగ భాగం గడిపితే కాని ఈ  జీవిత తత్వం బోధపడదు. ఎంతో సహజమైన విషయం, ప్రతి తరానికి అనుభవం ఇది.

అప్పుడు అమ్మ నాన్న మీద ప్రేమ పొంగుకొస్తుంది. ఆ ప్రేమ వరదలో వారిని ముంచెత్తేయాలనిపిస్తుంది. కానీ....
ఆ ప్రేమని అందుకోవడానికి వాళ్ళు ఉండాలిగా...ఉంటే అదృష్టమే.
కానీ.....

 వయసు మనని రోజురోజుకి పెంచినట్టుగానే మన అమ్మ నాన్నని కూడా పెంచుతుంది. వయసుతో పాటే మృత్యువు కూడా వెంట తరుముతుంది.
పెరుగుతోంది వయసని అనుకుంటాము ,
 కాని తరుగుతోంది ఆయువని తెలుసుకోము.....
 ఎంత అక్షరసత్యాలు కవి మాటలు.....

అందుకే అమ్మ నాన్న ఏం చేసినా మన కోసం, మన సుఖ సంతోషాల కోసం, ఉజ్వల భవిష్యత్ కోసమే చేసారని పిల్లలు అర్థం చేసుకోవాలి.  అమ్మా నాన్నలని అపార్థం చేసుకొనేముందు ఆ కోణంలో ఆలోచించి చూడాలి.  వాళ్ళు చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే కూడా పెద్ద మనసుతో క్షమించగలగాలి.
వాళ్ళు వయసు పెరిగి మళ్ళీ  పసిపాపలై పోతే  మనం వాళ్ళకి అమ్మగా, నాన్నగా మారాలి. వాళ్ళు మనకి చేసిన సేవలన్నీ వాళ్ళకి మనస్ఫూర్తిగా చెయ్యాలి.  మనం అమ్మ/ నాన్న అయినప్పుడు కానీ మన అమ్మ నాన్నల విలువను తెలుసుకోలేకుండా ఉంటే అది మరీ ఆలస్యం కావచ్చు.
అప్పుడే ప్రేమను పొందడంలోను, ప్రేమను పంచడంలోను ఉన్న దైవత్వాన్ని అనుభవించగలం.

15 August 2010

భారతమాతకు జేజేలు...

భారతవాసులందరికీ

స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!!

భారతదేశంలో వలసపాలనను అంతమొందించి స్వాతంత్ర్ర్యం సాధించుకోవడానికి జరిగిన ఎన్నో ఉద్యమాల ఫలితంగా మన దేశం పరాయిపాలన నుండి విముక్తి పొంది 1947 ఆగష్టు పదిహేనున ఎర్రకోటపై తొలిజెండా ఎగరేసింది. హింసాయుతమైనవి, అహింసా యుతమైనవి అనేక సిద్ధాంతాలతో జరిగిన ఈ స్వాతంత్ర్య ఉద్యమంలో అంతిమ లక్ష్యం భారతదేశాన్ని సర్వ స్వతంత్ర దేశంగా ప్రకటించడమే. ఆ లక్ష్యం నెరవేరిన రోజు -నేడే. నేటితో 63 సంవత్సరాలు పూర్తి అవుతాయి.

నేడే స్వాతంత్ర్యదినం వీరుల త్యాగఫలం
నేడే నవోదయం నేడే ఆనందం......ఓఓ....
పాడవోయి భారతీయుడా
పాడి సాగవోయి ప్రగతి దారులా....
మహాకవి శ్రీశ్రీ పాట తలచుకుంటే ఆ స్వాతంత్ర్యోద్యమ స్ఫూర్తితో మనసు నిండిపోతుంది.

భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో ఎందరు అశువులు బాసారో....
వారితో బాటు  ఈనాడు భారతదేశపు సార్వభౌమత్వాన్ని నిలబెట్టడానికి, శత్రుదాడులనుండి కాపాడడానికి ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి ఎందరు జవాన్లు రాత్రనక పగలనక ఎముకలు కొరికే చలిని లెక్కచేయక కాపలాకాస్తున్నారో వారందరికీ కృతజ్ఞతాభివందనాలు ప్రకటించి వారి దేశభక్తికి నీరాజనాలు అర్పించవలసిన రోజు - ఈ స్వాతంత్ర్యదినోత్సవం రోజు.

నాటి స్వాతంత్ర్యపోరాటంలోనే కాదు, ఈనాడు కూడా   ఏక్షణమైనా వారిని  మృత్యువు కబళించవచ్చని తెలిసినా, వారి మరణం తమ జీవితాలను ఎంత ప్రభావితం చేస్తుందో తెలిసినా, తాము అనాథలం అవుతామని ఎరిగి ఉన్నా ఎందరు వీరవనితలు వీరతిలకం దిద్ది తమ కొడుకులను, భర్తలను సైనికులుగా యుధ్ధభూమికి పంపుతారో తలచుకుంటే ఆ మహిళల సాహసానికి ఒళ్ళు గగుర్పొడుస్తుంది.

నిజంగా తమప్రతిరూపాలైన బిడ్డలను, తమ ప్రాణానికి ప్రాణంగా భావించే భర్తలను యుద్ధభూమికి పంపాలంటే వారిలో ఎంత స్వాతంత్ర్య స్ఫూర్తి ఉండాలి ?! దేశం పట్ల, తమ బాధ్యత పట్ల ఎంతభక్తి,  నిబద్ధత ఉండాలి!!  అలాంటి తల్లులకు, చెల్లెళ్ళకు కూడా ఈ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా అభినందనలు తెలప వలసిన రోజు కదా మరి ఇది.

ఇరవయ్యవ శతాబ్దంలోనే కాదు, దేశ స్వాతంత్ర్యం కోసం , స్వదేశాన్ని పరరాజుల నుండి రక్షించుకోవడం కోసం తమ కన్నకొడుకులను, కట్టుకున్న భర్తలను ప్రోద్బల పరచి, వారిలో పిరికితనాన్ని పోగొట్టి వారిని ధృఢచిత్తులుగా చేసిన మహిళలు ఎందరో ఉన్నారని మన సాహిత్యం కూడా నిరూపిస్తోంది.
తెలుగు భారత రచనచేసిన కవిత్రయంలో తిక్కన సోదరుడు -అతని పేరు కూడా తిక్కనే. ఆయన కవితిక్కన అయితే ఈయన ఖడ్గ తిక్కన గా పేరు పొందాడు.
చోళవంశపురాజు మనుమసిద్ధి కి, ఆయన సామంతుడు కనిగిరి ఎర్రగడ్డపాడు యాదవరాజు కాటమరాజుకు పుల్లరి విషయమై శత్రుత్వం మొదలై పెను యుద్ధానికి కారణమయింది. సైన్యాధ్యక్షుడైన ఖడ్గతిక్కన వీరోచితంగా పోరాడినా, సైన్యాన్ని పోగొట్టుకొని యుద్ధభూమినుండి వెనక్కి వచ్చేస్తాడు. ఖడ్గతిక్కన భార్య పేరు చానమ్మ.

పరాజితుడై ఇంటికి చేరిన భర్తకు రెండు బిందెల నీళ్ళు, ఇంత పసుపు ముద్ద పక్కన పెట్టి, ఒక మంచం చాటు గా ఇచ్చి స్నానానికి ఏర్పాటు చేసిందట చానమ్మ. అలా చేయడానికి కారణం చెప్తూ ఇలా అంటుంది.
పగఱకు వెన్నిచ్చినచో
నగరే మన మగతనంపు నాయకులెందున్
ముగురాడువారమైతిమి
వగపేలా జలకమాడ వచ్చిన చోటన్
అంటూ తను, ఖడ్గతిక్కన తల్లి ఆడవాళ్ళమయితే, యుద్ధభూమిలో పోరాడక తిరిగివచ్చిన భర్త కూడా ఆడదానితో సమానమయ్యాడని అంటూ భర్తలో వీరోచిత లక్షణాన్ని ఎగదోస్తుంది.
ఆ పరాభవానికే బాధ పడుతున్న తిక్కనకు తల్లి ప్రోలమ చెప్పిన మాటలు మరీ అవమానం కలిగించాయి. భోజనంలో అన్ని పదార్థాలను వడ్డించిన తల్లి, చివరగా విరిగిన పాలను వడ్డించిందట. పాలు విరిగిపోయాయని చెప్పిన తిక్కనకు ఆమె చెప్పిన సమాధానం ఇది.
అసదృశముగ నరివీరుల
పసమీరగ గెలువలేక పంద క్రియన్నీ
వసి వైచి విరిగి వచ్చిన
పసులున్ విరిగినవి తిక్క పాలు విరిగెన్ 

భార్య, తల్లి తమ శూలాల వంటి మాటలతో చేసిన పరాభవాలు తిక్కనలో ధైర్యాన్ని రగిల్చాయి. ఉత్తేజితుడైన ఖడ్గతిక్కన తిరిగి యుద్ధభూమికి వెళ్ళి శత్రువులతో పోరాడి విగత జీవి అయినా విజయం సాధించాడు.
స్వదేశ స్వాతంత్ర్యరక్షణ కోసం తమ కడుపుతీపిని, తమ మాంగల్యాన్ని లెక్కపెట్టని , వీరమాతలు, వీర కాంతలు
ప్రోలమ్మ.చానమ్మ.

చానమ్మ, ప్రోలమ్మలాంటి వీరవనితలు నారీలోకానికి ఆదర్శమూర్తులు. అలాంటి ఆదర్శ మహిళలు ఇప్పుడూ ఉన్నారు. వారందరికీ కూడా మనఃపూర్వకమైన కృతజ్ఞతాభినందనలు,కైమోడ్పులు.

చిన్నప్పుడు మనం రోజూ స్కూల్లో చేసిన ప్రతిజ్ఞని మరోసారి గుర్తుచేసుకుందాం.

భారతదేశం నా మాతృభూమి.
భారతీయులందరూ నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణం.
దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొంటాను.
నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను.
వారి శ్రేయోభివృద్ధులే నా ఆనందానికి మూలం.
(మా చిన్నప్పుడు ఈప్రతిజ్ఞ ఇంత వ్యావహారికంగా ఉండేది కాదు. ఇప్పుడు ఇలా కొద్దిగా మారింది)

చిన్నప్పుడు అర్థం అంత బాగా తెలియని రోజుల్లో చేయించే ఈ ప్రతిజ్ఞ ఇప్పుడు అన్ని కాలేజీల్లోను, కార్యాలయాల్లోను తప్పనిసరిగా చేయించాలని నా అభిప్రాయం. వ్యక్తిత్వం బాగా వికసించి, నిజంగా దేశభక్తి కలిగిఉండవలసిన యువతరానికి ఇది స్ఫూర్తినిస్తుంది. అవినీతి విషంతో కలుషితమవుతున్న సమాజంలో దేశం పట్ల తమ బాధ్యతను రోజూ గుర్తుచేసినట్లుంటుంది.

భారతమాతకు జై.    

05 August 2010

పేకాటోపదేశం

ఇండోర్ గేమ్స్ గా ఆడుకునే ఆటల్లో పేకాటదే అగ్రతాంబూలం అని నా అభిప్రాయం. ముఖ్యంగా ఆంధ్రదేశంలో ఈ పేకాట కి  పెళ్ళిళ్ళు, పిక్నిక్కులలో మంచి డిమాండ్ ఉంది. చతుర్ముఖ పారాయణం అని కొంచెం సంస్కృతంలో పిలుచుకున్నా చీట్లపేక అని చులకనగా చూసినా పేకాట కి ఉండే ప్రత్యేకత దానిదే.

అలనాడు కన్యాశుల్కంలో కూడా  గురజాడ అప్పారావు పేకాట సన్నివేశాన్ని మహా రసవత్తరంగా నిర్వహించారు. ఇప్పుడు పేకాటని బహిరంగప్రదేశాలలో నిషేదించాక ఎలా ఉందో కాని మా చిన్నప్పుడు ప్రతి పెళ్ళిలోను, వనభోజనాలప్పుడు, రైలు ప్రయాణాలలో  పదిమంది కలిసే సందర్భాలన్నిటిలోను దుప్పటి పరిచి పేకముక్కలు పంచుకునేవారు. హరిహరాదులు వచ్చి పిలిచినా పలకలేనంత మహా బిజీగా ఆడుకునేవారు. పెళ్ళిళ్ళలో మగ పెళ్ళివారికి విడిదిలో పేకాటకి ఏర్పాట్లు చేయడం, పేకాట బృందాలకి కాఫీలు, చిరుతిళ్ళు సప్లై చేయడం ఆడపెళ్లివారు జరపవలసిన ముఖ్యమయిన మర్యాదలలో  ఒకటేమో అనుకుంటాను. 

పేకాటలో బోల్డు రకాలున్నాయి. వీటిలో ఎక్కువగా ఆడుకునేవి మూడు ముక్కలాట, రమ్మీ.   మూడు ముక్కలాట ప్రధానంగా రాజు, రాణి, జాకీ, ఆసు ముక్కల కాంబినేషన్లో  ముక్కలు పడడం  బట్టి గెలవడం ఉంటుంది. మూడుముక్కలాట కేవలం అదృష్టం మీద ఆధారపడిన ఆట.  పదమూడు ముక్కలతో ఆడే రమ్మీ ముఖ్యమయినది. పదమూడు ముక్కలాటలో  సీక్వెన్స్, ట్రిప్లెట్, నాచురల్, జోకర్ వంటివి పారిభాషిక పదాలు.   రమ్మీ అని పిలుచుకునే పదమూడు ముక్కల ఆటలో అదృష్టంతో పాటు ఆడగాడి నైపుణ్యం, సమయానుకూలంగా స్పందించడం కూడా ముఖ్యమైన అంశాలే. ఇవన్నీ ఇప్పుడెందుకూ అంటే......

ఈ మధ్య పాత కాగితాలు సర్దుతూ ఉంటే మా నాన్నగారు ఎప్పుడో రాసిపెట్టుకున్న కాగితం దొరికింది.46 సంవత్సరాల క్రితం,  1964, అక్టోబరు 28నాటి నాటి ఆంధ్రప్రభ లో ప్రచురించబడిన ఓ కవితని చేత్తో రాసుకున్న కాగితం. కవిత పేరు మిడిల్ డ్రాప్. కవి పేరు వి. నారాయణరావు అని ఉంది.

పదమూడు ముక్కలతో ఆడే రమ్మీ ఆటని జీవితానికి అన్వయిస్తూ కొంచెం సరదాగాను, కొద్దిగా హెచ్చరికగాను, ఇంకొంచెం వైరాగ్యంతోను  చెప్పిన ఈ కవిత నాకు బాగా నచ్చింది.    కవిత రాసినవారు వి.నారాయణరావు - అంటే వెల్చేరు నారాయణరావుగారే అని గుర్తు అన్నారు మా నాన్నగారు. వెల్చేరునారాయణరావుగారు భాషా శాస్త్రవేత్తగా చాలా మందికి తెలుసు. ఆ కవితని ఇక్కడ ప్రచురిస్తున్నాను...ఆయన ఎక్కడ ఉన్నా కృతజ్ఞతాభినందనలతో.......


                       మిడిల్ డ్రాప్   

కావలసిన ముక్కొకటి తగలక పోతుందా అనుకున్నావు
కాంతా నయనాల కాంతులు చూసి భ్రమపడ్డావు
పన్నెండు ముక్కలు పండబెట్టుకోకుండా
కౌంట్ ఆర్ షో లో పెట్టుకున్నావు జీవితాన్ని
ఎప్పుడూ ఆశ పొడుగ్గానే ఉంటుంది
వచ్చేది జోకరనుకొని వెళ్ళు పేకలోకి
ట్రిప్లెట్లెప్పుడూ ఉండనే ఉన్నాయి
నాన్నా అమ్మా తమ్ముడూ లా సీక్వెన్సొకటి ఉంది
బతుకు కోసం కావలసిన రెండో సీక్వెన్సులో
పెయిర్ లోకి ముక్కలందడం లేదు ఇప్పటికీ
అవసరమయిన జోకరు కోసుకోవడం చేతకాలేదు
అమ్మాయిల  మనసుల్లా పక్కవాడి ఆట అర్థం కావడంలేదు
అరకు రాణీ వెక్కిరిస్తూ అవతలి వాడి చేతిలో చిక్కింది
అడ్రెస్ వెతుక్కుంటూ వచ్చేస్తున్నాయి అక్కర్లేని రాణులు
నువ్వు సేఫనుకొని కొట్టిన ప్రతిముక్కా
నవ్వుతూ ఎత్తుకుంటున్నాడు పక్కవాడు
ఇక పెయిరయే అవకాశం లేదు
ఇప్పటికయినా 'మిడిల్ డ్రాప్' పడెయ్యి, నా మాట విను
చప్పుడు చెయ్యకుండా ఆటలోంచి నిష్క్రమించు.....
(ఆంధ్ర ప్రభ 28.10.64)                   - వి. నారాయణరావు
  పేకాట ఆడడం తెలిసినవారికి ఈ కవితలోని పదార్థం(పదాల అర్థం)  బాగా అర్థం అవుతుంది. కవిత పేరే మిడిల్  డ్రాప్. రమ్మీ ఆటలో ముఖ్యమయిన పదం. ఎన్ని రౌండ్లు తిరిగినా ఆటలో కావలసిన ముక్కలు రాకపోతే, మన ఆటకి  పనికిరావని  పడేసిన ముక్కలు పక్కన కూర్చున్నవారికి పనికి వస్తుంటే, ఇంక ఆటని షో గా చూపించే అవకాశం రాదనుకున్నప్పుడు మిడిల్ డ్రాప్ చేస్తారు.

మనకు కావలసిన సమయంలో అవకాశాలు అందకపోవడం, మన వైఫల్యాలు అవతలి వాడి సాఫల్యానికి సహాయపడడం, మనం దక్కించుకుందామనుకున్న వస్తువు పక్కవాళ్ళకే దొరకడం  వంటివి జీవన వైఫల్యానకి గుర్తులు. వాటిని  పేకాటతో అన్వయించి చెప్పారు. చప్పుడు చెయ్యకుండా ఆటలోంచి నిష్క్రమించు  అన్న మాటలు కొంచెం కఠినంగా అనిపిస్తున్నా ఇప్పుడు కొందరు పాటిస్తున్న జీవన ధర్మమే కదా అది. అదే - బ్రతుకులోంచి మిడిల్ డ్రాప్.